నమ్మదగిన సమాచారం మేరకు జైపూర్ పోలీసులు ఇందారం క్రాస్ రోడ్డు వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న షేక్ ఆఫ్రీద్ (23) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 145 గ్రాముల గంజాయి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
శనివారం మధ్యాహ్నం అందిన సమాచారం ఆధారంగా, జైపూర్ సీఐ నవీన్ ఆదేశాల మేరకు ఎస్ఐ భూమేష్ సిబ్బందితో కలిసి ఇందారం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, నిందితుడు షేక్ ఆఫ్రీద్, జైపూర్ ఎస్.టి కాలనీ వాసి అని తేలింది. అతను కూలీ పనులు చేస్తూ, అధిక డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి, జైపూర్ మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు.
నిందితుడి వద్ద నుంచి 145 గ్రాముల గంజాయి, గంజాయి కొనుగోలు, విక్రయాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపిన రియల్మీ 6 ప్రో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.3,500 ఉంటుందని అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న ఆస్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.












