మంచేరియల్, 18-07-2026
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ పోలీసు అధికారులతో సీపీ అంబర్ కిషోర్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు విధుల నిర్వహణ, కేసుల పురోగతి, శిక్షల శాతం పెంపు, సాంకేతిక సమస్యలు, సాక్షుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ పోలీసు అధికారులతో సీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు విధుల నిర్వహణ, కేసుల పురోగతి, శిక్షల శాతం పెంపు, సాంకేతిక సమస్యలు, సాక్షుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
కోర్టు విధులకు సంబంధించిన ప్రతి పనిని నిర్దేశిత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని సీపీ సూచించారు. విధుల నిర్వహణలో ఎదురయ్యే పరిపాలనా లేదా సాంకేతిక సమస్యలను దాచిపెట్టకుండా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కోర్టు డ్యూటీ అధికారుల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రతి అధికారి తన పనితీరును మరింత మెరుగుపర్చుకునే దిశగా కృషి చేయాలని సూచించారు.
సమన్లు, బెయిలు మంజూరు కాని అరెస్టు వారెంట్లు (ఎన్బీడబ్ల్యూలు), ఇతర వారెంట్ల అమలు, కోర్టుకు సంబంధించిన అన్ని ప్రక్రియలను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సాక్షులను కోర్టుకు సకాలంలో హాజరుపరిచే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సాక్షులకు కోర్టు ప్రక్రియపై ముందస్తు అవగాహన కల్పించి, వారు ధైర్యంగా, స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చేలా అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు. విచారణ సమయంలో అనవసర గందరగోళానికి గురికాకుండా వారికి ధైర్యం చెప్పి, న్యాయ ప్రక్రియపై సరైన అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి కేసులో శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, సమయపాలన, నాణ్యమైన దర్యాప్తు, సమర్థవంతమైన కోర్టు నిర్వహణ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని సీపీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రతి నెల గుర్తించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. విధి నిర్వహణలో విశేష కృషి చేసి అనంతరం బదిలీపై వెళ్లిన అధికారుల దర్యాప్తు చేసిన కేసుల్లో తర్వాత శిక్షలు విధించబడినా, సంబంధిత అధికారుల సిఫారసు మేరకు వారికి కూడా గుర్తింపు, ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్లో శిక్షల శాతాన్ని పెంచడం, ప్రతి కేసును సకాలంలో పూర్తి చేయడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు సమర్థవంతమైన న్యాయ సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు డ్యూటీ సిబ్బందిని పోలీస్ కమిషనర్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, బాబురావు, ఎస్ఐ వినీత, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు.












