మంచేరియల్, 18-07-2026
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, పోలీస్ కమిషనర్ ఆదేశాలపై కమిషనరేట్ టాస్క్ఫోర్స్/నార్కోటిక్ బృందాలు శనివారం ఉమా మహేశ్వరి కాలనీలో ఆకస్మిక దాడులు నిర్వహించాయి.
ఈ దాడుల్లో సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.1.35 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఈ ఘటనకు సంబంధించి సీతారాంపల్లి గ్రామానికి చెందిన బత్తుల సమ్మయ్య (50)ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని, స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యంతో పాటు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.











