మంచేరియల్, 04-07-2026
చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులకు, వారి తల్లిదండ్రుల సమక్షంలో చెన్నూర్ పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి సంబంధిత కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో చెన్నూర్ పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, విద్య, ఉపాధి, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో సమాజంలో బాధ్యతగల పౌరులుగా జీవించాలని సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని, చెడు స్నేహాలు, మాదకద్రవ్యాల అలవాట్లకు దూరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు బానిసైనట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వారిని డీ-అడిక్షన్ కేంద్రానికి పంపించి చికిత్స, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కౌన్సెలింగ్కు హాజరైన వారు ఇకపై గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనబోమని, మంచి పౌరులుగా జీవిస్తామని పోలీసుల సమక్షంలో హామీ ఇచ్చారు. అదేవిధంగా, వారిపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, భవిష్యత్తులో గంజాయి కలిగి ఉన్నా, వినియోగిస్తున్నా లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో పట్టుబడితే, అవసరమైతే పీడీ చట్టం కింద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అత్యంత అవసరమని, గంజాయి విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100 / డయల్-112కు తెలియజేయాలని చెన్నూర్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.











