బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలను పటిష్టంగా పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. సోమవారం బ్యాంకులు, ఏటీఎంల భద్రతా ప్రమాణాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. నేరాలను నియంత్రించడానికి బ్యాంకులు, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, వివిధ బ్యాంకుల అధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాల నివారణ, గతంలో జరిగిన నేరాలు, భవిష్యత్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. పెద్దపల్లి జోన్లో 109 బ్యాంకులు, 79 ఏటీఎంలు, మంచిర్యాల జోన్లో 109 బ్యాంకులు, 89 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయని సీపీ తెలిపారు.
భద్రతా ప్రమాణాలపై కఠిన ఆదేశాలు
ప్రతి ఏటీఎం కేంద్రంలో 24 గంటలూ సెక్యూరిటీ గార్డు, నాణ్యమైన సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. భద్రతా ఆడిట్లో కొన్ని చోట్ల నాణ్యత లేని సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు లేకపోవడం గుర్తించామని, కాబట్టి అన్ని చోట్లా నాణ్యమైన కెమెరాలు, అలారం సిస్టమ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
దోపిడీ లేదా అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది ఎలా స్పందించాలనే దానిపై బ్యాంకు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. బ్యాంకు ప్రవేశ ద్వారం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (), సెక్యూరిటీ గార్డులకు హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ () అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
సెక్యూరిటీ గార్డుల పూర్తి వ్యక్తిగత వివరాలు, ఫోటోలతో సహా బ్యాంకు వద్ద రికార్డుగా ఉంచాలని, కొత్తగా లేదా తాత్కాలికంగా నియమితులైన సిబ్బంది విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












