తెలంగాణ వీరవనిత, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్, అధికారులు, సిబ్బంది ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పెత్తందార్ల దురాగతాలకు, నిరంకుశ రజాకార్లు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ మొక్కవోని ధైర్యంతో పోరాడిన తీరు అందరికీ ఆదర్శనీయమని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఆమె సాగించిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.
మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక అని, ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీ సూచించారు. ఆమె త్యాగం, పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని ఆయన అన్నారు.
ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని పేదలు, బలహీన వర్గాలు, బాధితులకు అండగా నిలిచి సేవ చేయాలని సీపీ పిలుపునిచ్చారు. పోలీసులుగా ప్రజలకు భరోసా కల్పించడం, బాధితులకు న్యాయం అందించడం మన బాధ్యత అని తెలిపారు. ఈ జయంతి సందర్భంగా ప్రజాసేవకు మరింత అంకితభావంతో పనిచేయాలని, అదే చాకలి ఐలమ్మకు మనం అందించే నిజమైన నివాళి అని సీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏఓ శ్రీనివాస్, ఆర్ఐలు శేఖర్, సీసీ సందీప్, సీపీఓ సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.











