బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం, తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను బీసీ ఉద్యమ సాహిత్య సృజనకు వేదికగా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు సంఘం అధ్యక్షురాలు, హైకోర్టు న్యాయవాది శ్రీమతి పెరం అలేఖ్య బీసీ సోదరీమణులకు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ ఉద్యమ స్ఫూర్తిని పాటల రూపంలో విస్తరింపజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
గత ఐదేళ్లుగా తెలంగాణ నేలపై సాగుతున్న బీసీ సామాజిక న్యాయ ఉద్యమం కేవలం రిజర్వేషన్ల పోరాటమే కాదని, అది ఆత్మగౌరవ పునరుద్ధరణ ఉద్యమమని శ్రీమతి అలేఖ్య తెలిపారు. ఈ ఉద్యమ స్ఫూర్తి విద్యావంతులైన మహిళా లోకంలోకి మరింత విస్తృతంగా చేరాల్సిన చారిత్రక అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
బతుకమ్మతో చైతన్య ఉద్యమం
స్త్రీ శక్తికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను, సామాజిక చైతన్య వేదికగా మార్చుకుందామని శ్రీమతి అలేఖ్య విజ్ఞప్తి చేశారు. ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో, బీసీ ఉద్యమ ప్రస్థానం, త్యాగాలు, రాజ్యాధికార ఆకాంక్ష, మహిళా సాధికారత అంశాలపై స్వీయ రచనలతో కూడిన పాటలను సృజించి, ఆలపించాలని ఆమె కోరారు.
ఉత్తమ రచనలకు పురస్కారాలు
ఆలపించిన పాటలను వీడియో రికార్డ్ చేసి పంపాలని, విశ్లేషణాత్మక సాహిత్యం కలిగిన ఉత్తమ రచనలకు, ఉత్తమ గానానికి గ్రామాల వారీగా ప్రత్యేక పురస్కారాలు అందజేయబడతాయని తెలిపారు. విజేతలను రాష్ట్ర స్థాయి బీసీ మహాసభలకు సగౌరవంగా ఆహ్వానించి, వేదికపై సత్కరిస్తారని పేర్కొన్నారు.
ఇది మేధో సామర్థ్యాన్ని, సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఒక సువర్ణావకాశమని, గొంతులోంచి వెలువడే ప్రతి పాట బీసీ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని శ్రీమతి అలేఖ్య అన్నారు. రండి, పాటతో ఉద్యమిద్దాం బతుకమ్మతో చైతన్యమవుదాం అని ఆమె పిలుపునిచ్చారు.












