మంచేరియల్, 2026-07-04
రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ సాగుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. వ్యవసాయం, ప్రజారోగ్యం, విద్య వంటి అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ సాగుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, ప్రజారోగ్యం, పంటల వైవిధ్యీకరణ, రైతు రిజిస్ట్రీ, త్రాగునీరు, ఇరిగేషన్, విద్య, వాతావరణ మార్పులు, ఉద్యానవనం, సూక్ష్మ సాగునీరు, ఆయిల్ పామ్ విస్తరణ, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలో వానాకాలం-2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు రైతులను సమన్వయం చేసుకుంటూ సన్నద్ధం కావాలని తెలిపారు. రాష్ట్రంలో 138.49 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యం నిర్దేశించామని, రైతులకు అవసరమైన మేరకు 99.13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని వెల్లడించారు. ఇప్పటికే 510.93 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని 68 మందిని అరెస్టు చేసి, 34 క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు.
జూలై నెలకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ ఉంచాలని, యూరియా అక్రమ రవాణా, అధిక ధరలకు విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, నానో యూరియా వినియోగాన్ని కూడా విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. రైతు రిజిస్ట్రీ కార్యక్రమంలో రాష్ట్రం దేశంలో ముందంజలో ఉందని, అర్హులైన ప్రతి రైతు నమోదు పూర్తయ్యేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యతనిస్తూ వరితో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఉద్యాన పంటల అభివృద్ధి, సూక్ష్మ సాగునీటి ప్రాజెక్టుల అమలులో జిల్లాల వారీగా పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని 33 జిల్లాలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, జిల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. సున్నిత ప్రాంతాలలో జ్వరాలపై ప్రత్యేక నిఘా చేపట్టి, ప్రతిరోజూ నివేదికలు పంపాలని, ప్రతి శుక్రవారం "డ్రై డే" కార్యక్రమం నిర్వహిస్తూ దోమల నివారణ చర్యలు, లార్వా నిర్మూలన, ఫాగింగ్, నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో శుభ్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు.
పట్టణాలు, గ్రామాలు, పాఠశాలలు, వసతి గృహాలు, నిర్మాణ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు చేపట్టాలని, గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, టైఫాయిడ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని, ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రులలో మందులు, పరీక్షా కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు, అత్యవసర చికిత్స సౌకర్యాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.












