ఓదెల, గురువారం
సాగునీరు, ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అయితే యూరియా, డీఏపీ వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, రైతులకు శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఓదెల మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సాగునీరు, ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అధిక యూరియా, డీఏపీ వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, రైతులకు శాస్త్రీయ సాగు విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయ రమణారావు అన్నారు.
ఓదెల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం రోజున నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు అవసరానికి మించి యూరియా, డీఏపీ ఎరువులను వినియోగించడం వల్ల భూముల సారవంతత క్రమంగా తగ్గిపోతుందని తెలిపారు. గతంలో ఎకరానికి అర బస్తా యూరియా కూడా వినియోగించేవారు కాదని, ప్రస్తుతం అధిక దిగుబడుల ఆశతో విచక్షణారహితంగా ఎరువులు వాడడం భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరించారు.
గ్రామాల్లో సర్పంచులు, వ్యవసాయ అధికారులు రైతులకు సమతుల్య ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు మరింతగా అనుసరించాలని కోరారు. రైతు వేదికల ద్వారా ఆధునిక సాగు విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత యాసంగి సీజన్లో యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం అమలు చేయడంతో ఎరువుల వినియోగం క్రమబద్ధీకరించబడిందని, భూముల సారం మెరుగుపడి ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి నమోదైందని గుర్తు చేశారు. ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ఎస్సారెస్పీకి నీరు క్రమంగా చేరుతోందని, మహారాష్ట్రలోని ప్రాజెక్టులు ఇప్పటికే 80 శాతానికి పైగా నిండాయని, తెలంగాణకు సాగునీటి విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.
ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే ఎస్సారెస్పీ కాలువల్లో నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందేలా తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సారెస్పీ ప్రధాన, ఉప కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా అన్ని కాలువలకు వెంటనే బుష్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి విడుదలకు ముందే కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన, వ్యవసాయ అధికారులు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి అవసరమైన సలహాలు, సేవలు అందించాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు గతంలో కాలువల ద్వారా చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడిందని, రాబోయే యాసంగి సీజన్‌కు కూడా సమృద్ధిగా సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఓదెల ఎంపీడీవో, తహసిల్దార్, మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, మండల స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.












