సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లాకు చెందిన నవ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లా కొండాపూర్‌కు చెందిన మహేందర్ (28), దీక్షిత (25) దంపతులు ఎనిమిది నెలల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం వారు బైక్‌పై హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామానికి ప్రయాణిస్తున్నారు.
సిద్ధిపేట జిల్లా పరిధిలో వెళ్తుండగా, వీరి ముందు వెళ్తున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో, మహేందర్ నడుపుతున్న బైక్ అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడిన దీక్షితను స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఆమె తుది శ్వాస విడిచింది. ఈ ఘటనతో కొండాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివాహమై ఎనిమిది నెలలు కూడా గడవకముందే నవ దంపతులు ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.










