రోడ్డు ప్రమాదాల నివారణకు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హన్నాన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి మంచిర్యాల పట్టణంలోని ఫ్లైఓవర్ వరకు ఉన్న యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలు, బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పరిశీలన జరిగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన రక్షణ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, అవసరమైన ఇంజినీరింగ్ పనులు తదితర అంశాలపై అధికారులు చర్చించారు.
మంచిర్యాల ఏఎంవీఐ సూర్యతేజ, మున్సిపాలిటీ ఏఈ మంచిర్యాల దుర్గం మధు, లా అండ్ ఆర్డర్ ఎస్సైలు తదితర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించడం, శాస్త్రీయమైన ఇంజినీరింగ్ చర్యలు చేపట్టడం, ట్రాఫిక్ భద్రతా చర్యలను అమలు చేయడంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోందని అధికారులు తెలిపారు.












