మంచిర్యాల పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.డి. హన్నన్ ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
మంచిర్యాల పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.డి. హన్నన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ట్రాఫిక్ సీఐ ఎం.డి.హన్నన్ విద్యార్థులకు రోడ్డు భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించడం, నిర్ణీత వేగ పరిమితిలో వాహనాలు నడపడం, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకపోవడం వంటి నిబంధనలను వివరించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాలు, వాటి ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు భద్రతపై విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
ముఖ్యంగా యువత వాహనాలు నడిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.












