మంచేరియల్, 2026-08-03
పర్యావరణాన్ని కలిసికట్టుగా కాపాడుకుందామని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాముని చెరువు ప్రాంతంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఎల్ నినో ప్రభావం, నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు.
పర్యావరణాన్ని కలిసికట్టుగా కాపాడుకుందామని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాముని చెరువు ప్రాంతంలో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్ లతో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాముని చెరువు సుందరీకరణ కొరకు నిధులు మంజూరు చేసి చర్యలు చేపడుతున్నామని, ఈ ప్రాంతంలో పచ్చదనం పెంపొందించడం, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం, వాకింగ్ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో సమతుల్య వాతావరణం కొరకు మొక్కలు నాటి కాపాడవలసిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు.
కాలుష్య నియంత్రణకు సమిష్టి కృషి అవసరం
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలలో, అవకాశం ఉన్న ప్రాంతాలలో మొక్కలు నాటి సంరక్షించాలని, కాలుష్య నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. మార్పులను నియంత్రించి సమతుల్య వాతావరణం నెలకొల్పేందుకు సమిష్టిగా పనిచేయాలని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాగా ప్రసిద్ధి చెందిందని, ప్రస్తుతం అటవీ శాతం తగ్గిందని, తిరిగి పెంపొందించేలా అందరం కలిసి కృషి చేద్దామని, ప్రకృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
హాజీపూర్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అనంతరం హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామపంచాయతీ పరిధిలో వి బి జి రామ్ జి పథకంలో భాగంగా 5 లక్షల రూపాయలతో ఫాం పాండ్ (పంట కుంట), బోర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, రూప్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, ఆత్మ చైర్మన్ మురళి, గ్రామ సర్పంచ్ బొడ్డు భూమన్న, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్తులో ఏర్పడే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా ఫామ్ పాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, వ్యవసాయ భూములలో పంట కుంట, గ్రామాలలో ఊట కుంటలు, భూగర్భ జలాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని వివరించారు.









