జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం జైపూర్ మండలంలోని ప్రభుత్వ విద్యా సంస్థలను ఆకస్మికంగా సందర్శించి, చేపట్టిన నిర్మాణ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేపట్టిన అదనపు గదులు, మూత్రశాలలు, భోజనశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గంగిపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మూత్రశాల నిర్మాణాన్ని కొందరు కూల్చివేస్తున్నారని దృష్టికి రాగా, వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, మెనూను పరిశీలించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో వసతి గృహ అదనపు తరగతి గదులు, భోజనశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, వంటశాలలో శుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, ప్రహరీ గోడ, అదనపు గదులతో పాటు సకల సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.












