అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి కార్మికుల సంక్షేమం, హక్కుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా కార్మికుల హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడుతానని హామీ ఇచ్చారు.
కార్మికులు ఎదుర్కొన్న చారిత్రక సమస్యలను గుర్తుచేస్తూ, పూర్వ నాయకుల పోరాటాల ఫలితంగానే నేడు వారికి హక్కులు లభించాయని మంత్రి తెలిపారు. యాజమాన్యాలు, కార్మికులు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. 2047 నాటికి దేశాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో కార్మికుల నైపుణ్య శిక్షణ కీలకమని, దీనికోసం రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) ద్వారా సుమారు 20,000 మంది యువతకు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.
కార్మిక శాఖకు ముఖ్యమంత్రి కేటాయించిన రూ.90 కోట్ల బడ్జెట్‌తో కార్మికుల సంక్షేమానికి మరిన్ని చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. TOMCOM ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్‌ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. హమాలీల సంక్షేమానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికులకు చట్టబద్ధ రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి వివరించారు. ఈఎస్ఐ ద్వారా కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, వాటిని మరింత విస్తరిస్తామని తెలిపారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రాముఖ్యత కల్పించిన అంబేద్కర్ ఆలోచనలు మార్గదర్శకమని అన్నారు. కార్మికుల చెమటతోనే దేశం నడుస్తోందని, వారికి గౌరవం, భద్రత, హక్కులు కల్పించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ కార్మికులు, హమాలీలు, సింగరేణి కార్మికుల సమస్యలను పార్లమెంట్లో బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు.








