మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు మంచిర్యాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సమాజానికి మహమ్మారిగా మారుతున్నాయని, ముఖ్యంగా యువత వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఎ. భాస్కర్ సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే డయల్-100 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలకు బానిసైన వారి కోసం డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.












