ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు.
రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారం నమోదు తర్వాత బూత్ స్థాయి అధికారులు వివరాలను పరిశీలించి, అర్హులైన ఓటర్లతో ముసాయిదా జాబితా తయారుచేసి, నివేదికల పరిశీలన అనంతరం హేతుబద్ధీకరించిన ముసాయిదా జాబితాను ప్రచురించాలని సూచించారు.
డూప్లికేట్ కార్డుల తొలగింపు, కంట్రోల్ టేబుల్, ఈ-టేబుల్ నిర్వహణ, డాష్బోర్డ్ & రిపోర్టింగ్, సుమోటో, ఫారం-బి నోటిఫికేషన్ జనరేషన్ వంటి ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాలను ఇంటింటి సర్వే ద్వారా సేకరించి, అర్హతలేని కార్డుల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించి, ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిష్కరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే కేంద్రం పరిధిలోకి వచ్చేలా జాబితా రూపొందించాలని తెలిపారు.
మ్యాపింగ్, ఓటర్ల తొలగింపు ప్రక్రియలలో రాజకీయ పార్టీల నుండి నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలని సూచించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి, ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలని, అర్హత గల ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలని ఆదేశించారు.












