తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, రాష్ట్ర సాధన కోసం పోరాడిన పార్టీలు, సంఘాలు, ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని, అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించిన లక్ష్మణ్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేయడం సంతోషకరమని, అయితే కాలయాపన చేయకుండా వారికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో పాలక ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఖలీందర్ అలీఖాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, దెవి పోచన్న, కామెర దుర్గరాజ్, మిర్యాల రాజేశ్వర్ రావు, కాదండి సాంబయ్య, ఎగుడ మొండి, పుజారి రామన్న, కుంచాల శంకరయ్య పాల్గొన్నారు.
పార్టీ ప్రజాసంఘాల నాయకులు తాళ్ళపెల్లి వీరయ్య, రొడ్డ నరేష్, బియ్యాల రాజేశం, రమేష్, నర్సయ్య, సిరికొండ రాయమల్లు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు.












