తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో (ఎస్టిపిపి) సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన, రాష్ట్ర అభివృద్ధి, ప్లాంట్ కార్యకలాపాలపై పలువురు వక్తలు ప్రసంగించారు.
ఎస్టిపిపిలో ఉదయం తెలంగాణ రన్, జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఈడి శ్రీ సిహెచ్ చిరంజీవి గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించిందని, దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్లలో ఒకటిగా నిలిచిందని ఈడి తెలిపారు. 2016 నుండి 2026 మార్చి వరకు 82,170.24 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి, 77,177.16 మిలియన్ యూనిట్లను గ్రిడ్‌కు సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘనత వెనుక ఉద్యోగుల శ్రమ ఉందని కొనియాడారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా, సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు, 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్, 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఎస్టిపిపిలో నిర్మించినట్లు తెలిపారు. సుమారు 700 కోట్లతో ఎఫ్.జి.డి ప్రాజెక్టును చేపట్టినట్లు, ఇది పర్యావరణ హానిని తగ్గిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో 1X800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ప్రభావిత గ్రామాలలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు కల్పించామని, మహిళా భవనాలు నిర్మించామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ అధికారి, ఉత్తమ ఉద్యోగికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.












