జనగణన-2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జనగణనను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు, మొదటి విడతలో ఇండ్ల గణన, రెండవ విడతలో జనగణన జరుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, జనగణన-2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జనగణనను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు, మొదటి విడతలో మే 11వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు ఇండ్ల గణన, రెండవ విడతలో జనగణన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.
డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన, స్పష్టమైన జాబితాను రూపొందించేందుకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు తగిన శిక్షణ అందిస్తామని కలెక్టర్ తెలిపారు. స్వీయ గణన కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖులు, గణన అధికారులు, యువత, స్వయం సహాయక సంఘాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు స్వీయ గణన పోర్టల్ అందుబాటులో ఉంటుందని, జిల్లాస్థాయి జనగణన అధికారులు ప్రతిరోజూ స్వీయ గణన వివరాలను నవీకరించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామపంచాయతీల్లో, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీలలో స్వీయ గణనపై ప్రజలందరికీ అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు స్వీయ గణన కార్యక్రమ కార్యచరణను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు జనాభా ప్రాతిపదికన జరుగుతుందని, ఈ క్రమంలో స్పష్టమైన జాబితా రూపొందించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. https://sc.census.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో స్వీయ గణన చేసుకోవచ్చని, అధికారులు ఇంటికి వచ్చినప్పుడు స్వీయ గణన ఐ.డి.ని అందించవచ్చని తెలిపారు.







