జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం వివిధ మండలాల్లో పర్యటించి, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను, పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. దరఖాస్తుల సత్వర పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై ఆరా తీశారు. అర్జీదారుల దరఖాస్తులను రికార్డులతో సరిపోల్చి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
కన్నెపల్లి తహసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల రికార్డులను పరిశీలించి, భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి చేపడుతున్న చర్యల్లో భాగంగా, పాఠశాలల్లో మంజూరైన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నెన్నెల, తాండూర్ మండలాల్లోని తహసిల్దార్ కార్యాలయాల్లోనూ భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను సమీక్షించారు.
కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అర్థం చేసుకొని, దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.







