నేటి ఆధునిక జీవనశైలిలో మానవులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్, అధికారులు, సిబ్బందికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగాను కేవలం ఒకరోజుకే పరిమితం చేయకుండా, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు.
యోగా అనేది వ్యక్తిగత నిబద్ధతతో ఎవరైనా సులభంగా సాధన చేయగల ఆరోగ్య సాధనమని కమిషనర్ పేర్కొన్నారు. ఆరోగ్యమే అత్యంత విలువైన ఆస్తి అని, సంపద, ఉన్నత స్థానాలను ఆస్వాదించడానికి ఆరోగ్యవంతమైన శరీరం, మనస్సు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందవచ్చని తెలిపారు.
పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువ సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో కూడా తమ ఫిట్నెస్ను కొనసాగించాలని సూచించారు. యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శాఖల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి సిబ్బందిలో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగా శిక్షకుల మార్గదర్శకత్వంలో, పోలీస్ కమిషనర్, అధికారులు, సిబ్బంది వివిధ యోగా ఆసనాలను అభ్యసించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.












