ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే భూమి అభివృద్ధి పనులు చేపట్టాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య ఆదేశించారు. గురువారం ఆయన చెన్నూర్ పట్టణ పరిధిలో లే అవుట్ స్థలాన్ని, పలు గ్రామాలలో ప్రధానమంత్రి–అజయ్ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు.
చెన్నూర్ పట్టణ పరిధిలో ఏర్పాటు చేస్తున్న లే అవుట్ స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్, అంతర్గత రహదారులు, మురుగు కాలువ వ్యవస్థ, ఉద్యానవనం వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రామాణికంగా ఏర్పాటు చేయాలని సూచించారు. లేఅవుట్ ఆమోదంలో రికార్డులను సక్రమంగా పరిశీలించి, అనుమతుల ప్రకారం మాత్రమే అభివృద్ధి పనులు కొనసాగాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం, ప్రధానమంత్రి–అజయ్ పథకంలో భాగంగా కత్తెరసాల, నర్సక్కపేట్, పాగేపల్లి గ్రామాలలో పారిశుధ్య పనులు, మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలించారు. కాలువల శుభ్రతను సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. పగటి వేళల్లో వీధి దీపాలు వెలుగడాన్ని గమనించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎస్.సి. కాలనీలో మురుగు కాలువల పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని, కాలనీలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. దెబ్బతిన్న పైపుల కారణంగా నిలిచిపోయిన నీటి ట్యాంకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
నర్సక్కపేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. ఎరువుల దుకాణం తనిఖీలో ట్రేడ్ లైసెన్స్ పెండింగ్లో ఉన్నట్లు గుర్తించి, వెంటనే బకాయిలను చెల్లించాలని యజమానికి సూచించారు.







