మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికా 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండల సమాఖ్యల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మేయర్ ధర్ని మధుకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్, అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ, వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా మహిళలు వివిధ వ్యాపారాలలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. బ్యాంకు లింకేజీ, ఎన్.ఆర్.ఎల్.ఎం., ప్యాడీ కమిషన్, పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. పథకాల కింద హాజీపూర్ మండలంలో 382 యూనిట్లకు రూ.18.07 కోట్లు, దండేపల్లి మండలంలో 316 యూనిట్లకు రూ.16.79 కోట్లు, లక్షెట్టిపేట మండలంలో 512 యూనిట్లకు రూ.18.23 కోట్లు, మొత్తం 1210 స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా రూ.53.10 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన మహిళలు, తాము ఆర్జించిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని సంఘాల ఖాతాలలో పొదుపు చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచేలా కృషి చేయాలని కోరారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవకలకు తావులేకుండా, పారదర్శకంగా, వేగంగా కొనుగోలు ప్రక్రియ జరిగేలా చూడాలని సూచించారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం రాష్ట్రంలోనే మొదటగా పూర్తయిందని, ఈ అవకాశాన్ని సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.












