రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు, 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలలో, మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీలలో డివిజన్/వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించనున్నారు. ఈ సభలలో వివిధ కీలక అంశాలపై చర్చించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, గ్రామ, వార్డు సభల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ సభలకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, యాసంగి వరి ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించాలని సూచించారు.
వచ్చే ఖరీఫ్ సీజన్ లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రణాళిక రూపొందించాలని, మహిళల రక్షణ, మాదకద్రవ్యాల నివారణ, రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వర్షాకాలంలో పారిశుధ్యం, మురుగు కాలువల శుభ్రత, ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపుపై దృష్టి సారించాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను సిద్ధం చేసుకోవాలని, విపత్తుల ప్రతిస్పందన బృందాలను అప్రమత్తం చేయాలని తెలిపారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సభలు నిర్వహణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడానికి వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటామని, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య పనులను నిత్యం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సభలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారుల సమన్వయంతో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, విద్యుత్, ముఖ్య ప్రణాళిక శాఖల అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












