జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయు) సెక్రెటరీ జనరల్ సోమ సుందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల కోసం ఐజేయు అనేక ఉద్యమాలు చేపట్టిందని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని నార్త్ ఇన్ హోటల్ లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమ సుందర్ ను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనల కవరేజీకి వెళ్తే పోలీసులు జర్నలిస్టులపై అమానుషంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులను పోలీసులు ఏ విధంగా చూస్తారో, అదే విధంగా జర్నలిస్టులను చూడటం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని సోమ సుందర్ ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, వాటి వలన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వం, వారిని ఆదుకోవడంలో విఫలమవుతోందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులందరికీ ఉచితంగా వైద్యం అందించడానికి హెల్త్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన కోరారు. ఈ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే, ఐజేయు ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు కేశెట్టి వంశీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి పింగిళి, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ రాజు, ఎర్రం ప్రభాకర్, కాచం సతీష్, బిరుదుల దేవరాజ్, చొక్కారపు శ్రీనివాస్, శ్రీధర్, తిరుపతి, రాజేష్, లక్ష్మణ్ లు పాల్గొన్నారు.











