రామకృష్ణాపూర్, మందమర్రి, మంచిర్యాల పరిధిలోని తవక్కల్ విద్యాసంస్థల అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు, విద్యార్థి సంఘ నాయకులపై భౌతిక దాడి ఘటనపై సోమవారం (19.10.2026) కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములుకు , విద్యార్థి సంఘాల నాయకులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దసరా సెలవుల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించడానికి వెళ్లిన తమపై పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్, సిబ్బంది భౌతిక దాడికి దిగి, కలెక్టర్కు చెప్పుకుంటారో, డీఈఓకు చెప్పుకుంటారో చెప్పుకోండి... ఎవడు మమ్మల్ని ఏం చేయలేడు అంటూ దుర్భాషలాడిన దృశ్యాల వీడియో, ఫోటో ఆధారాలను నాయకులు అదనపు కలెక్టర్కు చూపించారు.
విద్యాసంస్థల తీరుపై ఫిర్యాదు
మందమర్రిలోని తవక్కల్ పాఠశాల భవనం చెరువు పక్కనే నిర్మించారని, విచారణ చేపట్టాలని కోరారు. మంచిర్యాలలోని పాఠశాల అత్యంత ఇరుకైన గల్లీలో, బస్సు కూడా తిరగలేని ప్రమాదకర పరిస్థితుల్లో నడుస్తోందని అధికారుల దృష్టికి తెచ్చారు. ఆధారాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ రాములు, ఫిర్యాదుపై, నాయకులపై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.
ప్రధాన విజ్ఞప్తులు
అక్రమ తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థి నాయకులపై దాడికి దిగిన రామకృష్ణాపూర్ తవక్కల్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, మందమర్రి తవక్కల్ పాఠశాల భవనం చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో తేల్చడానికి మండల రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరారు. మంచిర్యాలలోని ఇరుకైన సందులో విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న తవక్కల్ పాఠశాల నిర్వహణపై విచారణ చేపట్టాలని, విద్యార్థి నాయకులపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడిన చైర్మన్ అబ్దుల్ అజీజ్, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులు విచారణ జరిపి తవక్కల్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని, లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి పిలుపునిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దెబ్బటి అరుణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్, జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, నాయకులు సాయితేజ, అరవింద్, దుర్గ ప్రసాద్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.












