మంచిర్యాల జిల్లాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 175వ జయంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఆయన అందించిన సేవలు స్మరణీయమని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 175వ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, బీసీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, డి.సి.పి. ఎ.భాస్కర్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఐ.బి. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు సదా స్మరణీయమని తెలిపారు. ఆయన కేవలం స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా, సమాజంలో సమానత్వం, మహిళల అభివృద్ధి, కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత విభేదాలు లేకుండా పౌరులందరూ సమానమని చాటుతూ రాజ్యాంగాన్ని రచించారని, విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు.
ఆనాటి సమాజంలోని అసమానతలను ఎదుర్కొని ఉన్నత విద్యనభ్యసించి, సమాన అవకాశాల కోసం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్, వివిధ దేశాల రాజ్యాంగాల ప్రేరణతో రూపొందించిన భారత రాజ్యాంగం నేడు దేశ పరిపాలనకు సులభతరమైందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రాజ్యాంగం అందరికీ ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు రాజ్యాంగం ప్రకారమే జరుగుతోందని, ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని ఆయన స్పష్టం చేశారు.
డి.సి.పి. మాట్లాడుతూ, అంబేద్కర్ విశ్వ మానవతావాది అని, తాను ఎదుర్కొన్న కష్టాలు మరెవ్వరూ అనుభవించకూడదనే సంకల్పంతో సమానత్వానికి పునాది వేశారని తెలిపారు. మహిళలకు అవకాశాలు కల్పించడం, కార్మికులకు 8 గంటల పని విధానం, ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం వంటి కీలక సంస్కరణలకు ఆయన కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రచించిన, ఆలపించిన అంబేద్కర్ పై గీతాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నాటకాలు అందరినీ అలరించాయి. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకాలు అందజేశారు.




