పెద్దపల్లి, 2026-07-27
పెద్దపల్లి పట్టణంలో 'SIR' కార్యక్రమంపై దృష్టి సారించాలని, ఓటర్లను ఓటరు జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలంగాణ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు, పట్టణంలో 'SIR' కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలో కలిసికట్టుగా 'SIR' పై దృష్టి సారించాలని, 36 వార్డుల్లో ఈ కార్యక్రమంపై ప్రతి ఒక్క కౌన్సిలర్, వార్డ్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అవసరమైతే వార్డుల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి సూచనలు చేశారు.
పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా సహకరించాలని ఆయన కోరారు. పట్టణంలోని ప్రధాన రోడ్డు అయిన జెండా చౌరస్తా నుండి మసీదు చౌరస్తా వరకు గల 300 మీటర్ల రోడ్డును వ్యాపారస్తుల కోరిక మేరకు 55 అడుగుల వెడల్పు చేయడం జరుగుతుందని, దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు వెడల్పు చేసిన తరువాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ వంటి అన్ని హంగులతో పాత రోడ్డును సుందరంగా తీర్చిదిద్దుతామని, వ్యాపారస్తుల వ్యాపారం మరింత మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మున్సిపల్ పరిధిలోని ఓటర్లను ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని, రేపటి నుండి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గడువు తేదీ వరకు పూర్తి స్థాయిలో 'SIR' కార్యక్రమాన్ని శ్రద్ధతో పూర్తి చేయాలని సూచనలు చేశారు. తానే స్వయంగా మున్సిపల్ పరిధిలో 'SIR' కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు తెలిపారు. సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన జెండా చౌరస్తా నుండి మసీదు చౌరస్తా వరకు గల రోడ్డు వెడల్పు జరగనున్న రోడ్డును వ్యాపారస్తులను కలుస్తూ పరిశీలించారు.












