మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నస్పూర్ గేట్ ప్రాంతంలో లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
జిల్లాలోని నస్పూర్ గేట్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. నస్పూర్ సమీపానికి చేరుకున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీని ఆటో ఢీకొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు యువతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులను సౌందర్య, రమ్య, రవళిగా గుర్తించారు. వీరు మంచిర్యాలలోని ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నట్లు సమాచారం. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆటోలో బయలుదేరారు. నస్పూర్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మండలం గుడిపల్లి, పొన్నారం గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆటోకు మార్గమధ్యంలో ఒక బైక్ అడ్డుగా రావడంతో, దాన్ని తప్పించేందుకు డ్రైవర్ ఆటోను పక్కకు తిప్పాడు. అదే సమయంలో ఎదురుగా లారీ రావడంతో ఆటో దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో తీవ్రంగా దెబ్బతింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.










