చావుతో సహవాసం చేసే సత్తా ఉన్న కార్మిక సోదరులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అంటే మన సింగరేణిలోనే ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభలో ఆయన మాట్లాడారు.
పోరాటాల పురిటిగడ్డ రామగుండం అంటేనే రణగర్జన చేసే గడ్డ అన్నారు. ఇక్కడ కార్మికుల త్యాగం ఉంది, కష్టం ఉంది. నల్లబొగ్గు కోసం నెత్తురు చిందించి, ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, చీకటి గుహల్లో రక్తతర్పణం చేసిన వారు ఇక్కడ ఉన్నారని గుర్తు చేశారు.
బొగ్గు ఉత్పత్తి చేయడమే కాదు, ఉద్యమాలను నడిపించడం కూడా మీకు బ్రహ్మాండంగా తెలుసు. ఉద్యమాల్లోనూ మీరు మొనగాళ్లే అని కొనియాడారు.
కేసీఆర్ పిలుపునిస్తే సకల జనుల సమ్మెలో 35 రోజులు, ఆ తర్వాత మరో 7 రోజులు, మొత్తం 42 రోజుల పాటు ఒక్క బొగ్గు పెళ్ల కూడా బయటకు రాకుండా మీరు తిరగబడితే దక్షిణాది రాష్ట్రాలన్నీ చిమ్మచీకట్లో ఉండిపోయాయని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ తెలంగాణ జెండా ఎగరేసి బయలుదేరితే ఆయనకు అండగా నిలబడింది సింగరేణి కార్మిక లోకమేనని, ఆ విషయాన్ని తాము ఎప్పటికీ మర్చిపోమని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు బోనస్, జీతాలు, హక్కుల కోసం ఉద్యమాలు చేస్తాయని, కానీ సొంత రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన కార్మికులు ఉన్న ఒకే ఒక్క గడ్డ సింగరేణి అని గర్వంగా చెబుతున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.











