శ్రీరాంపూర్ లోని ఆర్కే 7 గనిపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ బ్రాంచ్ నూతన పిట్ కమిటీని ఎన్నుకుంది. ఈ ఎన్నిక సందర్భంగా పెద్ద సంఖ్యలో యువ కార్మికులు యూనియన్లో చేరారు. వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. నూతన కార్యదర్శిగా మెల్లం శ్రీధర్ ను నియమించారు.
ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, కార్మిక సమస్యలపై సీఐటీయూ చేస్తున్న ఆందోళనలను గమనించిన కార్మికులు స్వయంగా సీఐటీయూలో చేరడం యువ కార్మికులతో యూనియన్ బలోపేతం అవుతుందని తెలిపారు. గెలిచిన సంఘాలు తమ హయాంలో చేసిన వాటికంటే పోగొట్టినవే ఎక్కువగా చెప్పుకుంటున్న తీరును కార్మికులు గ్రహిస్తున్నారని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు దాటినా ఇప్పటికీ యాజమాన్యం చేత లాభాలను ప్రకటించలేని స్థితిలో ఉన్న ఈ యాజమాన్య అనుకూల సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టియుసిలు ఉన్నాయని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా యాజమాన్య సంఘం, ప్రభుత్వ అనుకూల సంఘాలు కలిసి ప్రభుత్వం, యాజమాన్యంపై పోరాడుతున్నామని చెబుతూనే, సంస్థ అభివృద్ధికి రెండు సంవత్సరాలుగా 6000 కోట్లకు పైగా నిధులను పక్కన పెట్టి, కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితికి రావడంలో వీరి సహకారం ఉందని అన్నారు. తీవ్ర పని ఒత్తిడితో కార్మికులు సతమతమవుతుంటే, ఈ రెండు యూనియన్లు కలిసి పరిమితమవుతున్నాయని, వారి అనుబంధ రాజకీయ పార్టీలు కార్మికుల్లో తిరుగుతున్నాయని విమర్శించారు. లాభాలను తక్కువ చేసి చూపించడానికి ఆలస్యంగా ప్రకటించి, వెంటనే వాటా చెల్లించే ప్రయత్నం చేస్తున్న తీరు సరైనది కాదని అన్నారు. బోనస్ సమావేశం జరగక ముందే, యాజమాన్యం సంస్థకు వచ్చిన లాభాలతో పాటు బకాయిలను కూడా తెలియజేయాలని, లేదంటే త్వరలో అన్ని గనులపై అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్మిక సమస్యలపై ఎలాంటి రాజకీయాలు చేయకుండా, కార్మికులను చైతన్యవంతం చేయడం ద్వారానే యాజమాన్యంపై పోరాడి సమస్యలను పరిష్కరించే కార్మిక సంఘాలు కావాలని అన్నారు. కార్మిక సంఘంగా తమ వంతుగా సంస్థను రక్షించుకోవాలని, విద్యుత్ సౌదా వద్ద బకాయిల వసూళ్లకై చేసిన ధర్నా ఫలితంగా ప్రభుత్వంలో కదలిక వచ్చినా, కొందరు అడ్డుకొని బకాయిలు రాకుండా చేస్తున్నారని, సంస్థపై చిత్తశుద్ధి ఉన్నవారు గనులపై కాకుండా, రాజకీయంగా సింగరేణి బకాయిలు ఇప్పించే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, నూతన పిట్ కమిటీ 7 ఫిట్ సెక్రెటరీ మెల్లం శ్రీధర్, అసిస్టెంట్ ఫిక్స్ సెక్రెటరీ కొమ్ము సమ్మయ్య, ఆర్కే సెవెన్ ఇంచార్జ్ కొమ్ము ప్రవీణ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెతుకు నరేష్, యూనియన్ లో చేరిన పి కిరణ్, ఎం నగేష్, రమేష్, ఈ వెంకటేష్, సుధాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఆర్ నరేష్, రమేష్ మరియు యూనియన్ బ్రాంచ్ నాయకులు రామగిరి రామస్వామి, గోదారి భాగ్యరాజు, సాయిల శ్రీనివాస్, మిడివెల్లి శ్రీనివాస్, వెంగళ శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ పాల్గొన్నారు.










