జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీని ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చేపట్టిన సమ్మెకు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మద్దతు తెలిపారు.
ప్రభుత్వంపై దివాకర్ రావు విమర్శలు
అనంతరం దివాకర్ రావు గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, కేవలం టీ తాగే సమయంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొచ్చని అన్నారని, కానీ గెలిచిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఐదో రోజుకు చేరిన ధర్నా
ఎన్నికల్లో ఇచ్చిన హామీని గాలికి వదిలేసి కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చేస్తున్న ధర్నా ఐదో రోజుకు చేరిందని అన్నారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.









