జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నిరుద్యోగ యువత తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను పొందవచ్చని అన్నారు. శుక్రవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి, కెరీర్‌పై అవగాహన సదస్సుకు హాజరైన ఆయన, యువత ప్రభుత్వ అందిస్తున్న శిక్షణా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అందిస్తున్న వృత్తి విద్య, ఆధునిక సాంకేతికత శిక్షణను యువత ఉపయోగించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. ఎంచుకున్న కోర్సులను శ్రద్ధగా నేర్చుకోవాలని, తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు నైపుణ్యం తప్పనిసరి అని, నేర్చుకున్న ప్రతి అంశం ఆచరణలో ఉపయోగపడుతుందని తెలిపారు.
జర్మనీ వంటి దేశాలలో ఎలక్ట్రీషియన్, డ్రైవర్, నర్సింగ్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన వారికి డిమాండ్ ఉందని, వారికి భాషా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. విదేశాలలో లభించే అవకాశాలకు నైపుణ్యత, అనుభవం కీలకమని, కోర్సు పూర్తయిన తర్వాత అప్రెంటిస్ షిప్ ద్వారా మరింత నైపుణ్యం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, తద్వారా అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. యువత తమ కోర్సులను ఏకాగ్రతతో అభ్యసించి, నైపుణ్యత సాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, ఎ టి సి ప్రిన్సిపాళ్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.












