ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా పౌష్టికాహారం సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థలలో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వంటశాల, సామాగ్రి నిల్వ గదిని పరిశీలించి, ఆహారం తయారీలో సిబ్బంది శుభ్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో అనుత్తీర్ణులైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల తీరును కూడా ఆయన పరిశీలించారు.
ఆదర్శ పాఠశాలల వసతి గృహాన్ని సందర్శించి, అక్కడ కొనసాగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ విభాగాల నిర్మాణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు.
ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 129.25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అధికారులు, గుత్తేదారుల సమన్వయంతో పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.





