రాష్ట్రంలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాను 'ఎ', 'బి', 'సి', 'డి' కేటగిరీలుగా విభజించి, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో పాటు, గ్రామాలలో సెర్ప్ సిబ్బంది, మున్సిపాలిటీలలో మోప్మా సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో స్పష్టమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామని, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణపై విస్తృత ప్రచారం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.










