హైదరాబాద్, 4 August
కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు మణుగూరు -2 డిప్ సైడ్ బ్లాక్ కేటాయించడాన్ని బీజేపీ స్వాగతించింది. ఈ నిర్ణయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు మణుగూరు PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఎలాంటి బిడ్డింగ్ లేకుండా తాడిచెర్ల-2 కోల్ బ్లాక్‌తో పాటు ఇటీవల మణుగూరు PKOC-2 సైడ్ డిప్ కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిందని తెలిపారు. ఈ కేటాయింపుల వల్ల రాబోయే 30 ఏళ్లలో 180 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని, దీని ద్వారా సింగరేణి సంస్థకు రూ.42,360 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని, సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో, సింగరేణి సంస్థ ఆదాయాన్ని పెంచి, రాష్ట్ర నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల-2, మరియు POCK-2 కోల్ బ్లాక్‌లను సింగరేణికి కేటాయించినట్లు రఘునాథ్ వెరబెల్లి తెలిపారు. ఈ మూడు కోల్ బ్లాక్‌ల ద్వారా మొత్తం 860 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 6,500 మందికి జీవనోపాధి, సింగరేణి సంస్థకు రూ.1,95,510 కోట్ల రెవిన్యూ, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.48 వేల కోట్ల ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అండగా నిలుస్తూ, ఆదాయ వనరులను కల్పిస్తోందని అన్నారు.
మరోవైపు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు డిఫాల్టర్‌గా ఉన్నప్పటికీ, ఏడాదిన్నర కాలంలో బ్యాంకులకు రూ.400 కోట్లకు పైగా ఎలా చెల్లించారనే దానిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. 2023 ఎన్నికల ముందు వరకు వివిధ బ్యాంకులకు రూ.470 కోట్లకు పైగా అప్పుగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు, ఇప్పుడు ఎలా చెల్లించారని ఆయన ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులకు సన్నిహితుడిగా చెప్పుకునే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అవినీతికి వారు బాధ్యత వహిస్తారా అని ఆయన నిలదీశారు. ప్రేమ్ సాగర్ రావు అవినీతి, అక్రమాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.












