రామగుండం, 2026-08-06
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఆయన జయంతి సందర్భంగా పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో చిత్రపటానికి నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రొ. జయశంకర్ సార్ చిత్రపటం వద్ద పూలను ఉంచి తమ నివాళులను అర్పించారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు, 1969 తెలంగాణ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమం, మలిదశ తెలంగాణా ఉద్యమం లో పాల్గొని దేశ వ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేశారు అని తెలిపారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.
యువతకు ఆదర్శం
ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్పూర్తితో ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె.శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











