చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి పీడీ యాక్ట్ అమలు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఐపీఎస్, ఏసీపీ ఆర్.ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రజలతో నేరుగా సంభాషించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాలపై ప్రత్యేక నిఘా, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అనుమానాస్పద ప్రాంతాలు, ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు.
ఏదైనా సమస్య లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే డయల్-100కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని, తక్షణ స్పందన ఉంటుందని కమిషనర్ హామీ ఇచ్చారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అత్యవసరమని, ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయం పెరిగితే సమాజంలో నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. గతంలో పోలీసుల పిలుపునకు ప్రజలు దూరంగా ఉండేవారని, ప్రస్తుతం పెద్ద సంఖ్యలో స్పందించి హాజరుకావడం మంచి పరిణామమని తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చినా, పనుల్లో పెట్టుకున్నా వారి పూర్తి వివరాలు సేకరించాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు. కొందరు నేరస్థులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నేరాలకు పాల్పడుతున్నారని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని, షీ టీమ్లు, భరోసా సెంటర్లు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు వేధింపులు, హింసకు గురైతే వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని, అవసరమైతే షీ టీమ్ సిబ్బంది సహాయం అందిస్తారని చెప్పారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాలను యువతలో వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీషీట్లు తెరిచి పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, వ్యసనాలకు గురైన వారికి ప్రభుత్వ సహకారంతో మెడికల్ కళాశాలలో డీ-అడిక్షన్ వార్డులు ఏర్పాటు చేశామని, చికిత్స కోసం అక్కడికి పంపే ఏర్పాట్లున్నాయని తెలిపారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతియుతంగా, మత సామరస్యంతో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.











