కష్టపడి చదివితే ఎంచుకున్న లక్ష్యాలను సాధించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన విద్యా వారోత్సవాలు - విద్య విజయోత్సవ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, పౌష్టికాహారం అందిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను నిబద్ధతతో అభ్యసించాలని, లక్ష్యాలను సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని ఆయన సూచించారు.
జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య మాట్లాడుతూ, జిల్లాలో విద్యా ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 97.20 శాతం ఫలితాలు సాధించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా 3.75 శాతం పెరిగిందని, ఇది విద్యార్థుల సంఖ్య 1,32,000 కు చేరిందని ఆయన పేర్కొన్నారు.
విద్యా విజయోత్సవ దినోత్సవం సందర్భంగా, 10వ తరగతి, ఇంటర్మీడియట్, క్రీడా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ సన్మానించి, రూ.10,000 నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
అలాగే, అమ్మకు అక్షరమాల (ఉల్లాస్) కార్యక్రమంలో సేవలు అందించిన వాలంటీర్లను, రాష్ట్రస్థాయిలో కళా వైభవం, హస్త కళలలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను కూడా సన్మానించి, వారి సేవలను కొనియాడారు.












