ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై హైదరాబాద్లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.
హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం, హిమాయత్ నగర్లో జరిగిన ఈ సమీక్షలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల వేగవంతం, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన మంజూరు, భూమి సమస్యలు, పరిపాలనా ఆటంకాలు, ఫీల్డ్ స్థాయి అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పనులు ఆలస్యం కాకుండా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్, విజయ రమణారావు, మేడిపల్లి సత్యం, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా సమగ్ర కార్యాచరణ అవసరమని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేసి, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.
ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో చేరుకోవడానికి, లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు సజావుగా జరిగేలా చూడటానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పెండింగ్లో ఉన్న పనులను సత్వరం పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన అధికారులను ఆదేశించారు.











