నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ కేటాయించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ, అర్హత కలిగి ఇందిరమ్మ ఇళ్లు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 100 ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన ఇళ్లు నిర్మాణ పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.
రహదారుల విస్తరణలో భాగంగా బావురావుపేట గ్రామం నుండి కత్తెరసాల వరకు 5 కోట్ల రూపాయలు, బావురావుపేట నుండి కాచనపల్లి వరకు 3 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని, వీటిని త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో రహదారులు, మురుగు కాలువల అభివృద్ధి పనులు, నీటి సమస్యల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు.
భూ నిర్వాసితులకు 26 కోట్ల రూపాయల నష్టపరిహారం మంజూరు చేయబడిందని, బోర్ వెల్ ల ఏర్పాటు ద్వారా నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 300 బోర్ వెల్స్ ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో దాదాపు 5 వేల 500 కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయని, నిర్మాణ పనులకు దశలవారీగా పరిశీలించి బిల్లులు చెల్లిస్తామని, 2వ విడత కార్యక్రమాన్ని జూన్ మాసంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆర్.టి.సి. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని, నిరుద్యోగ యువతకు విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా జర్మన్ భాషను నేర్పించి ఉద్యోగ కల్పన దిశగా కృషి చేస్తున్నామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నామని తెలిపారు. అనంతరం బావురావుపేటలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశానికి హాజరయ్యారు.








