ఓదెల, 17 November
అర్హులందరికీ పింఛన్లు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా మండలంలో 664 నూతన పింఛన్లు మంజూరు చేశామని, అలాగే 43 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశామని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి కూడా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మండలం పోత్కపల్లి గ్రామంలోని ప్రసన్న గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 664 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరీ పత్రాలను అందజేశారు. అనంతరం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు రూ. 43,04,988 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ విజయరమణ రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు, మహిళలు, చేనేత, గీత తదితర వృత్తిదారుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గతంలో పింఛన్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించి ఇబ్బందులు పడ్డ అక్కాచెల్లెళ్లకు, సోదరులకు ఊరట కలిగిస్తూ మండల వ్యాప్తంగా మొత్తం 664 మందికి నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మండలంలో మంజూరైన 664 పింఛన్లలో 144 మంది వికలాంగులు, 55 మంది ఒంటరి మహిళలు, 125 మంది గీతా కార్మికులు, 331 మంది వితంతువులు, 09 మంది చేనేత లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి అర్హులైన పేదలందరికీ న్యాయం చేయగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు.
వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురైన వారిలో అర్హులను గుర్తించి, త్వరలోనే పింఛన్లు అందిస్తామన్నారు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పింఛన్లు రాకుండా పోయాయని, అటువంటి వారు ఏమాత్రం ఆందోళన చెందవద్దని కోరారు. మీ బిడ్డగా, మీ ఎమ్మెల్యేగా 100 పరిశీలన చేసి, రీ-సర్వే ద్వారా ఆ లోపాలను సరిదిద్ది, భవిష్యత్తులో పింఛన్ ఇప్పించే పూర్తి బాధ్యత నాదే అని పునరుద్ఘాటించారు. గత 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు ఏమాత్రం పింఛన్లు అందించిన దాఖలాలు లేవని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంతో పాటు మరో నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు అందించేలా ముఖ్యమంత్రితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ తో నీరందించానని, పంటలు ఎండిపోకుండా కాపాడాలని వివరించారు. కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కరువు కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిందని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దని వివరించారు.
విద్యుత్ సంక్షోభం ఎక్కడా లేదని, ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ అందించే బాధ్యత తమదేనని తెలిపారు. గత పాలకులు ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని, తాము అధికారంలోకి రాగానే 5 లక్షల రూపాయలతో నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి అందించామని వివరించారు. రానున్న రోజుల్లో ప్రతి అర్హుడికి ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇస్తామని, ఇది తన హామీ అని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, అడ్డగోలు కటింగ్లతో అడ్డంగా దోచుకుందని వివరించారు. అలాగే, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నాడు ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ అయ్యేలా మంజూరు ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులందరికీ, ఆ రోజు సాయంత్రంలోపు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ అవుతుందని స్పష్టం చేశారు. మూడు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చారని, పెన్షన్లు సైతం 100 అందిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూనే, సంక్షేమ పథకాలను నిర్విరామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు.





