రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ ఎస్టీపీపీ పవర్ ప్లాంట్‌లో ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భద్రతా సిబ్బంది సన్నద్ధతను సమీక్షించడం ఈ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యం.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఆక్టోపస్ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో అత్యాధునిక ఆయుధాలతో ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు వంటి మౌలిక వసతులను ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని, అలాంటి దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భద్రతా సిబ్బంది సన్నద్ధత అత్యవసరమని అధికారులు తెలిపారు.
ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది ఎలా స్పందించాలి, దాడిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించడమే మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. దీని ద్వారా సిబ్బందికి అవగాహన కలుగుతుందని, భద్రతా ఏర్పాట్లలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
స్థానిక పోలీసులు, ప్లాంట్ భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ప్రాజెక్ట్ నిర్వహణ సిబ్బంది మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇటువంటి మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయని సీపీ తెలిపారు. ఈ మాక్ డ్రిల్‌లో మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, జైపూర్ ఏసీపీ ఆర్.వెంకటేశ్వర్లు, జైపూర్ సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ భూమేష్, స్థానిక పోలీసు సిబ్బంది, ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.












