భూ రీ సర్వే పనుల నిర్వహణ కోసం అవసరమైన జిఎన్ఎస్ఎస్ రోవర్ పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తెలిపారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఆయన సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ.ఓ.ఐ. ద్వారా ఆసక్తిగల సంస్థల వివరాలు పరిశీలిస్తామన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు మాట్లాడుతూ, రీ సర్వే ప్రక్రియలో అవసరమైన రోవర్ల కొనుగోలు కొరకు ఈ.ఓ.ఐ. ( ) ప్రక్రియ ద్వారా ఆసక్తిగల సంస్థల వివరాలు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. భూ రీ సర్వే పనులకు అవసరమైన సాంకేతిక ప్రమాణాలు, పరికరాల పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. భూ రీ సర్వే పనులను మరింత ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆధునిక సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
సిఎంఆర్ డెలివరీ, బకాయిల వసూళ్లపై సమీక్ష
అనంతరం, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సిఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైస్ మిల్లులకు సంబంధించిన సిఎంఆర్ బియ్యం పంపిణీలో మిగిలి ఉన్న డెలివరీలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయి మొత్తాల రికవరీ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. సిఎంఆర్ లక్ష్యాల సాధనలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.











