2026-27 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ప్రత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ సంవత్సరం 1,72,141 ఎకరాలలో ప్రత్తి సాగు చేయగా, మొత్తం 16,97,161 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఎకరానికి సగటున 9.60 క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర ప్రకారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు జరుగుతుందని, లాంగ్ స్టేపుల్ పత్తి ధర క్వింటాలుకు రూ. 8,667, మీడియం స్టేపుల్ పత్తి ధర క్వింటాలకు రూ. 8,267గా నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పత్తిని విక్రయించి మద్దతు ధర పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో సి.సి.ఐ. ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కోసం 11 జిన్నింగ్ మిల్లులను ప్రతిపాదించగా, ఇందులో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో 5, చెన్నూర్ మార్కెట్ కమిటీ పరిధిలో 5, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ పరిధిలో ఒక జిన్నింగ్ మిల్లును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని తగ్గించి, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు సి.సి.ఐ. అందుబాటులోకి తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ వినియోగంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
రైతులకు యాప్ వినియోగంపై అవగాహన
రైతులు తమ ఆధార్, ఫోన్ నంబర్, భూమి వివరాలు, పత్తి సాగు వివరాలతో యాప్లో నమోదు చేసుకోవాలని, అనుకూలమైన కొనుగోలు కేంద్రం/జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకుని, తేదీ వారీగా స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం ప్రత్తిని విక్రయానికి తీసుకురావచ్చని సూచించారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతు వేదికలలో రైతులకు పత్తిలో తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలు, కపాస్ కిసాన్ యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
దిగుబడి పరిమితి సవరణ, కౌలు రైతుల నమోదు
సగటు దిగుబడి కంటే ఎక్కువ దిగుబడి సాధించిన రైతుల భూములను ఏఈఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం సాఫ్ట్వేర్లో దిగుబడి పరిమితిని సవరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటల్ సంతకం లేని రైతులు, కౌలు రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాఫ్ట్వేర్లో నమోదు చేయాలని, అర్హులైన రైతులందరికీ మద్దతు ధర ప్రయోజనం అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు శాఖల వారీగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.
మార్కెటింగ్ శాఖ: ప్రతి మార్కెట్ యార్డులో తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి. రెవెన్యూ శాఖ: గ్రామాలలో దండోరా ద్వారా మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేయాలి. పత్తిని విడిగా, వదులుగా తీసుకురావాలని సూచించాలి. తూనికలు కొలతల శాఖ: జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డులలోని తూకం యంత్రాలు, వే-బ్రిడ్జిలను తనిఖీ చేసి, అవసరమైన కాలిబ్రేషన్ చేపట్టాలి. పోలీస్ శాఖ: రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రాంతాలలో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలి. రవాణా శాఖ: ప్రత్తి రవాణా వాహనాల రాకపోకలకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి. అగ్నిమాపక శాఖ: జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డులలో అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహించాలి.












