రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ హాజీపూర్ పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించిన ఆయన, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ హాజీపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రిసెప్షన్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, సంబంధిత రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం, అప్లోడ్ చేసే విధానంపై స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో చర్చించారు. పెండింగ్ కేసుల ఫైళ్లు, క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలపై ఎస్ఐ కిరణ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని డీసీపీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలని, స్థానిక సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని సూచించారు.
మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సీసీ కెమెరాల అవసరం, ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.












