కొత్త ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. అధిక ధర ఉన్నప్పటికీ, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావంతో కొనుగోలుదారులు అనవసర ఖర్చులు చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిస్ అవుతున్నామేమో అనే భయం, సామాజిక ఒత్తిడి కొనుగోళ్లను ప్రేరేపిస్తున్నాయని వారు తెలిపారు.
కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారీ మార్కెట్లో కనిపించే సందడి ఈసారి మరింత పెరిగింది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విక్రయాలు భారత్‌లో ప్రారంభం కాగా.. యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు భారీగా క్యూ కట్టారు. అయితే కొత్త ఫోన్‌పై ఉన్న ఆసక్తి క్రమంగా మిస్ అవుతున్నామేమో అనే భయంగా మారి, కొందరిని ఆలోచించకుండా ఖర్చు చేసేలా చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర సుమారు రూ.1.64 లక్షలు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర సుమారు రూ.1.79 లక్షలుగా ఉంది. ఇంత అధిక ధర ఉన్నప్పటికీ కొత్త మోడల్‌ను సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో పలువురు ముందుగానే స్టోర్ల వద్దకు చేరుకున్నారు. కొందరు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి ఖరీదైన గ్యాడ్జెట్లు కొనుగోలు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు.
సెలబ్రిటీల సోషల్ మీడియా పోస్టులతో మరింత ప్రభావం
ఐఫోన్ 18, 18 ప్రో మ్యాక్స్‌ను సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రదర్శించడం, ఇన్ఫ్లుయెన్సర్లు కొత్త ఫోన్‌ను ఉపయోగిస్తున్న వీడియోలు, రీల్స్ పోస్ట్ చేయడం వినియోగదారులపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణ ప్రకటనల్లో ఉత్పత్తి ప్రత్యేకతలను మాత్రమే వివరిస్తే, ఇన్ఫ్లుయెన్సర్ల పోస్టులు మాత్రం ఇతరులు కొనుగోలు చేస్తున్నారు.. మనం కూడా కొనాలి అనే సామాజిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. కొత్త ఫోన్‌కు సంబంధించిన వీడియోలు, సమీక్షలు, పోలికలు పదేపదే కనిపించడం వల్ల ఆ ఉత్పత్తి తప్పనిసరిగా అవసరమన్న భావన కలగవచ్చని వారు వివరించారు.
ఈ మోజును ఏమంటారు
ఇతరులు ఏదో కొత్త విషయాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు తాము దానికి దూరంగా ఉన్నామనే భావనను ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ () అంటారు. సోషల్ మీడియా విస్తరణతో ఈ భావన మరింత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
పరిమిత కాల ఆఫర్లు, తక్కువ స్టాక్, కౌంట్డౌన్లు వంటి మార్కెటింగ్ పద్ధతులు కొనుగోలు చేయాలనే ఆతృతను పెంచుతాయని సైకాలజీ నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా అవసరం లేకపోయినా కొత్త మోడల్ కోసం డబ్బు ఖర్చు చేసే పరిస్థితి రావచ్చని వివరించారు.
ఈఎంఐలతో అసలు ఖర్చు మరిచిపోతున్నారా
కొత్త ఫోన్ కొనుగోలు సమయంలో చాలామంది నెలవారీ ఎంత అన్నదానిపైనే దృష్టి పెడుతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఫోన్ ధరతో పాటు ఇన్సూరెన్స్, ఛార్జర్, కేస్, ఇతర ఉపకరణాలు, ప్రాసెసింగ్ ఛార్జీలు వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయని గుర్తుచేస్తున్నారు.
అలాగే వారంటీ ముగిసిన తర్వాత స్క్రీన్ దెబ్బతింటే మరమ్మతు ఖర్చు ఫోన్ విలువలో గణనీయమైన భాగం కావచ్చని నిపుణులు పేర్కొన్నారు. అందువల్ల కొనుగోలు చేసే ముందు ఫోన్ ధర మాత్రమే కాకుండా మొత్తం వినియోగ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.












