మంచేరియల్, 2026-11-25
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఈనెల 29వ తేదీన ఏర్పాటు చేసినట్లు పూర్వ విద్యార్థుల కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈమేరకు బుధవారం, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు పారుపెల్లి ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి విజయ కుమార్, కోశాధికారి పూర్ణచందర్ రావు మాట్లాడారు. పద్మనాయక ఫంక్షన్ హాలులో వచ్చే ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సమ్మేళనం ఉత్సహభరితంగా సాగుతుందని తెలిపారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం ఇది మూడవసారి అని నిర్వాహకులు తెలిపారు. కళాశాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో పూర్వ విద్యార్థుల కమిటీ పురుడుపోసుకుందన్నారు. 2022లో తొలి సమ్మేళనం, 2024లో ద్వితీయ సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రతి రెండేళ్లకు ఒక పర్యాయం సమ్మేళనం జరగడం ప్రభుత్వ కళాశాల ప్రత్యేకత అని అన్నారు.
1975 విద్యా సంవత్సరం నుంచి 1995 వరకు అన్ని ఫ్యాకల్టీల పూర్వ విద్యార్థులు వెయ్యికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పూర్వ విద్యార్థులకు రవాణా, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. వీలుంటే కుటుంబ సభ్యులతో సమావేశానికి రావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా జరగనున్న సమావేశానికి కళాశాలలో విద్యాభ్యాసం చేసిన అన్ని పార్టీల నేతలు హాజరవుతారని చెప్పారు. అందరికీ సమాన గౌరవం ఉంటుందని వెల్లడించారు. కాలేజీ పాత మిత్రులను కలుసుకునే అపూర్వ ఘట్టాన్ని జారవిడుచుకోవద్దని కోరారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.







