సీనియర్ జర్నలిస్టుల సంక్షేమానికి జాతీయ పెన్షన్ పథకాన్ని ఏర్పాటు చేయాలని సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జెఎఫ్‌ఐ) త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్. ఇంద్రసేనారెడ్డికి వినతి పత్రం సమర్పించింది.
త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్. ఇంద్రసేనారెడ్డి బీహార్ పర్యటనలో ఉన్నందున, ఆయన రాజ్‌భవన్ అధికారులను ఆదేశాల మేరకు, ఎస్‌జెఎఫ్‌ఐ ప్రతినిధుల బృందం గురువారం త్రిపుర లోక్‌భవన్‌లో సంయుక్త కార్యదర్శి జయంత్ భట్టాచార్జీకి వినతి పత్రం అందజేసింది.
ఈ సందర్భంగా, గవర్నర్ ఓఎస్డీ బి.వి. ప్రసాద్ రచించిన "తెలుగులో బెంగాలీ నేర్చుకోండి" పుస్తకాన్ని పాత్రికేయ బృందానికి బహూకరించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో కూడిన సమగ్ర గ్రంథాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం, అధికారులు ప్రతినిధి బృందానికి నూతన లోక్‌భవన్ పరిసరాలను చూపించారు. లోక్‌భవన్‌లో సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న కూరగాయలను స్థానిక ఆశ్రమాలకు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యకలాపాలు సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
అగర్తలాలో జరిగిన త్రిపుర వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహాసభకు హాజరైన సీనియర్ జర్నలిస్టుల బృందం లోక్‌భవన్ అధికారులను కలిసింది. ఈ బృందంలో ఎస్‌జెఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు పులిపలుకుల ఆనందం, త్రిపుర వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బిజాయ్ పాల్, దక్షిణాది రాష్ట్రాల జర్నలిస్టుల సంఘం సభ్యులు డా. బండి విజయ్ కుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి. మొయిజ్, ఎండి రఫీ, ఎస్వి99 టీవీ జర్నలిస్ట్ గవినోళ్ల రామకృష్ణ ఉన్నారు.







